Saturday, June 25, 2011

ఎరువుల వాడకం

ఎరువుల వాడకం
(Fertilizer application)
  • రసాయనిక ఎరువులు తేలికగా కరిగి త్వరిత గతిన పోషకాలను మొక్కలకు అందించుతాయి.
  • త్వరితం గా కరగడం వలన నష్టాలు కూడా చాలా ఎక్కువ ( అడుగు పొరల లోనికి పోవడం, ఆవిరి రూపం లో గాలిలో కలవడం మొదలైనవి )
  • అందువలన రసాయనిక ఎరువులు వాడేటప్పుడు ఈ క్రింది అంశాలను దృష్టి లో వుంచు కోవాలి.
    1. ప్రాంత వాతావరణ పరిస్థితులు . ఉదా: ఖరీఫ్ x రబీ పంట
    2. నేల లక్షణాలు ( నేల రచన, సమస్యాత్మక నేలలు తేలిక నేలలు బరువు నేలలు )
    3. ఎరువు లక్షణాలు : ఘన, ద్రవ పదార్ధాలు, గుళికలు చూర్ణం
    4. పంట పోషక అవసరాలు వరి కోస్తా -60 Kg N, రాయలసీమ 200 Kg N
    5. పంట కీలక దశలు (పోషకాలు) కీలక దశ ప్రాముఖ్యత
    6. నీటి వసతి వర్షాధారం నీటి పారుదల
ఎరువులు వేసే సమయం:
ఎరువులు వేసే సమయం నిర్ణయించుటకు  ఈ క్రింది అంశాలను పరిగణన లోనికి తీసుకోవలయును : అవి..
  1. మొక్క వివిధ దశలలో పోషకాలను సంగ్రహించు కొనే రీతి
  2. నేల యొక్క లక్షణాలు
  3. ఎరువు యొక్క లక్షణాలు
  4. మొక్కల లో పిండి పదార్ధ వినిమయము

  • సామాన్యం గా స్థూల పోషకాలైన  నత్రజని, భాస్వరం, పొటాష్ ఎదిగే దశలలో తీసుకొంటాయి
  • భాస్వర అవసరం తొలి దశ లో ఎక్కువగా ఉండడం మరియు భాస్వరం ఎరువు త్వరగా నీటిలో కరుగదు మరియు భాస్వరం స్థాన చలనం చాల తక్కువ  కనుక భాస్వరాన్ని ఆఖరి దుక్కి లో గాని, నాటే టప్పుడు / విత్తే టప్పుడు వేసుకోవచ్చు
  • నత్రజని అవసరం మొక్క తొలి దశ లో కొంత తక్కువగా, ఎదుగుదల దశ లో ఎక్కువగా మరియు పంట ఆఖరు దశ లో తక్కువ గా ఉంటుంది.
  • పిండి పదార్ధాలు, క్రొవ్వులు, మాంసకృత్తులు తయారీకి అవసరమైన నత్రజనిని  అవసర సమయాల్లో మోతాదు లు నిర్ణయించి దఫ దఫాలు గా వేయాలి
  • నత్రజని సులభం గా నీటిలో కరిగి leaching మరియు volatilization నష్టాలు ఎక్కువ గనుక తేలిక నేలల్లో  దఫ దఫాలు గా వేసిన నత్రజని నష్టం తగ్గించ వచ్చు.
  • మొక్క ఎదుగుదల, ఆహారోత్పత్తుల తయారీకి పొటాష్ పాత్ర గణనీయమైనది. పొటాష్ మొత్తం మొదటి దశ లోనే వేసుకోవచ్చు. తేలిక నేలలయిన రెండు దఫాలు గా వేయాలి.
  • గింజల సంఖ్య ను పొటాష్ ప్రభావితం చేస్తుంది. ఉదా: వరి, మొక్కజొన్న
  • పంట నాణ్యత పొటాష్ మీద ఆధార పడి ఉంటుంది.
  • గాలిలో నత్రజని స్థిరీకరించే అపరాల (pulses) పంటలకు కొద్ది మోతాదు లలో తొలి దశ లోనే వేయవలసి ఉంటుంది. వేరు పై బుడిపెలు ఏర్పడిన తర్వాత ఈ పైర్లకు నత్రజని ఎరువుల అవసరం తక్కువ.

ఎరువులు వేసే పధ్ధతి : (Methods of fertilizer application)
వేసిన ఎరువులు మొక్కక్కు సకాలం లో సక్రమం గా అందడానికి, ఎరువులు వృధా కాకుండా ఉండడానికి నేల స్వభావం (తేలిక x  బరువైన నేలలు) మొక్క లక్షణాలు ( వేరు ఎంత లోతు పోతుంది) ను పరిగణన లోనికి తీసుకొని వివిధ పద్ధతులలో ఎరువులు వేస్తారు.

I.                   ఘన రూప ఎరువుల వాడకం:
1. వెదజల్లు పధ్ధతి (Broadcasting):
విత్తే సమయం లో పైరు లేనపుడు మడి లో ఎరువు వెదజల్లు పధ్ధతి లేదా పైరు ఉండగా మడిలో వెదజల్లు పధ్ధతి. మన రైతులు ఎక్కువ గా ఈ పద్ధతినే ఆచరిస్తారు.
  • పైరు వత్తుగా పెరిగినపుడు, నేలంతట వ్రేళ్ళు అల్లుకుని కమ్మినపుడు, నీటిలో కరగని ఎరువు వేయు నపుడు (రాక్ ఫాస్పేట్) వెదజల్లు పధ్ధతి మంచిది.
  • దగ్గరగా విత్తనం విత్తే పైర్లలో వెదజల్లు పధ్ధతి సామాన్యం గా వాడుకలో వుంది.

ఎరువులు వెదజల్లుట వలన నష్టాలు:
  • పొలమంతా ఎరువు జల్లడం వలన కలుపు మొక్కల పెరుగుదలకు ప్రోత్సాహం  కలుగుతుంది. అందుచేత ఎరువుల వలన పూర్తి లాభం పైరుకు అందదు.
  • వేసిన రసాయన ఎరువు ఈ పధ్ధతి లో అధిక విస్తీర్ణం లోని మట్టి రేణువులతో కలియడం వలన, ప్లేస్ మెంట్  పధ్ధతి లో కంటే ఎక్కువ స్థిరీకరణ చెంది వెంటనే మొక్కలకు లభ్యం కాదు. ఉదా: నీటిలో కరుగు భాస్వరపు ఎరువైన సింగిల్ సూపర్ ఫాస్పేట్.
  • చల్ల వలసిన / తక్కువగా యున్న లేదా చల్లే వానికి తగు సామర్ధ్యం లేకపోయినా ఒక చోట ఎక్కువ గానూ, మరొక చోట తక్కువ గానూ చల్లటం జరుగుతుంది. దాని వలన ఎరువు ఎక్కువ పడిన చోట పైరు అధికం గా పెరిగి, తక్కువ పడిన చోట సరిగా పెరగదు. పైరు సమానం గా ఉండదు.
  • పొడి మట్టి మీద యూరియా వంటి రసాయన ఎరువును వెదజల్లితే, నత్రజని ఆవిరిగా మారి గాలిలో కలిసి పోతుంది.
  • పంట ఉన్నపుడు ఈ పధ్ధతి వలన ఆకులపై తేమ వున్నచో యూరియా వంటి ఎరువులు చల్లినపుడు ఆకులు మాడి పోతాయి.(scorching)

2.ప్లేస్ మెంట్ పధ్ధతి:
  • విత్తనానికి దగ్గరలో లేక మొక్కకు దగ్గర లో ఎరువు పడేటట్లు గా వేసే పధ్ధతి ని ప్లేస్ మెంట్ పధ్ధతి అంటారు.
  • ఈ క్రింద తెలిపిన పరిస్థితులలో ఈ పధ్ధతి ప్రకారం ఎరువులు వేస్తారు.
Ø  చల్లవలసిన ఎరువు తక్కువ గా ఉన్నపుడు
Ø  భాస్వరం, పొటాషియం ఎరువులు వేసేటప్పుడు
Ø  మొక్క వరుసలు ఒక దాని కొకటి దూరం గా ఉన్నపుడు
Ø  వేరు అభివృద్ధి తక్కువగా వున్నపుడు, నేలలో సారం తక్కువ గా ఉన్నపుడు
వెదజల్లు పధ్ధతి కంటే ప్లేస్ మెంట్ పధ్ధతి వలన చాలా లాభాలున్నాయి.
  1. నేలలో నిర్ణీత స్థలం లో ఎరువు వేయడం వలన ఎరువు వీలయి నంత తక్కువ మట్టి రేణువులతో కలుస్తుంది. అందుచేత స్థిరీకరణ చెందడానికి అవకాశం తక్కువ.
  2. పొలమంతటా ఉన్న కలుపు మొక్కలు ఈ ఎరువును వినియోగించు కోలేవు
  3. ఎరువు అవశేష ప్రతి ఫలం ఎక్కువ. కనుక తరువాత పంటకు లభిస్తుంది.
  4. వేరుకు దగ్గరలో ఎరువు పడుతుంది. కాబట్టి మొక్క ఎరువును సులభం గా తీసుకోగలదు.
  5. నత్రజని ఎరువు నష్టం బాగా తగ్గుతుంది . భాస్వరపు ఎరువులు వేసినచోటనే ఉంటాయి. కదలవు.
  6.   పధ్ధతి లో ఎరువులు వేసిన అధిక దిగుబడులు వచ్చును.
విత్తనాలు విత్తే సమయం లో క్రింద తెలిపిన ఏ చోటనైనా ఎరువు పడేటట్లు వేయవచ్చు.
  1. విత్తనం ఎరువు (ఫాస్పేట్ ) కలిపి గొర్రు తో విత్తవచ్చు.
  2. విత్తనం వరుస కు కొద్ది దూరం లో పడేటట్లు ఎరువు వేయవచ్చు
  3. విత్తనం వేసే లోతు కంటే ఎక్కువ లోతులో వేసుకోవచ్చు
  4. విత్తనానికి ఒక ప్రక్క గాని, రెండు ప్రక్కల గాని ఎరువు వేయవచ్చును.
ప్లేస్ మెంట్ కు వాడు పరికరాలు:
  1. నాగలి
  2. గొర్రు
  3. రాయల గొర్రు (విత్తనం , ఎరువు ఒకే సారి వేసుకోవచ్చు)
  4. ట్రాక్టర్ తో లాగబడే విత్తనం మరియు ఎరువు వేసే యంత్రం (seed cum fertilizer drill)
నేల మీద పైరు వున్నపుడు క్రింద తెలిపిన పధ్ధతి లో ఎరువులు వేసుకోవచ్చు
  1. పట్టీ వలె ఎరువు వేయడం (Band placement)
మొక్క వరుసకు ఒక ప్రక్క గాని, రెండు వైపులా గాని  4 5 సెం. మీ లోతైన కాలువ చేసి దానిలో ఎరువు వేసి కాలువ మూసి వేయాలి.
  1. రెండు మొక్కల వరుసల మధ్య తేలిక నాగలి తో చాలు తీసి, చాలు లో ఎరువు వేయవచ్చు
  2. స్పాట్ / పాకెట్ ప్లేస్ మెంట్ (spot / pocket placement)
ఒక్కొక్క మొక్కకు దగ్గర లో 4 5 సెం. మీ లోతైన గుంత తీసి గుంత లో ఎరువు వేసి గుంత ను మట్టి లో పూడ్చాలి. ఈ పధ్ధతి చాలా వరకు కూరగాయ పంటలలో వాడతారు.
  1. రింగ్ ప్లేస్ మెంట్ (ring placement)
పండ్ల మొక్కల మొదలుకు దూరం గా రింగ్ వంటి కాలువ లేక గాడి తీసి దానిలో ఎరువు వేసి మట్టితో కప్పాలి.

వివిధ రకాలు గా ఎరువులు వేయవచ్చు కాని అనుకూలమైన పద్ధతిని ఎంపిక చేయడానికి దిగువ కొన్ని సూచనలు ఇవ్వబడ్డాయి.

1)      నీటిలో వెంటనే కరుగు నత్రజని , పొటాషియం ఎరువు లను విత్తనాలకు అతి దగ్గరగా వేసినట్లు అయితే మొలక  దెబ్బ తింటుంది. అందుచేత అటు వంటి ఎరువులను  విత్తనాలకు కొద్ది దూరం లో వేసుకోవాలి.
2)      భాస్వర ఎరువులు విత్తనాలకు తగిలి నప్పటికీ మొలక దెబ్బ తినదు. అంతే కాక భాస్వరపు ఎరువులు నేలలో వేసినచోటు నుండి కదలవు కాబట్టి విత్తనాలకు అతి దగ్గర లో వేసినపుడు వేళ్ళకు అందుబాటులో ఉంటుంది. అందుచేత విత్తనాలు, భాస్వరపు ఎరువు కలిపి విత్తు కోవచ్చు.
3)      పప్పు జాతి పంటలకు ఎరువులు దూరం లో వేసుకోవాలి.
4)      వేరు లోతుకు పోని పంటలకు బ్యాండ్ పధ్ధతి మంచిది. వేరు లోతుకు పోవు పంటలకు విత్తనం వరుసకు క్రింద ఎరువు పడేటట్లు వేయాలి.

ప్లేస్ మెంట్ పధ్ధతి లో ఆచరణ యోగ్యమైన విషయాలు:
  • విత్తనాలకు అవసరమైనంత దూరం లో, అవసరమైనంత లోతులో పడేటట్లు వేయడానికి విత్తనాలను, ఎరువులను ఒకేసారి వేయడానికి అనువైన సీడ్ కం ఫెర్టిలైజర్ డ్రిల్స్ విస్తారం గా వాడుతున్నారు.
  • మన దేశం లో ఎద్దులు లాగడానికి వీలుగా సీడ్ కం ఫెర్టిలైజర్ డ్రిల్ తయారు చేసారు (ఈనాటి గొర్రు , రాయల గొర్రు)

సామాన్యం గా ఆచరించే ప్లేస్ మెంట్లు రెండు రకాలు:
1)      విత్తనం కంటే లోతు గానూ, విత్తనానికి దిగువగానూ ఎరువు వేయు పధ్ధతి
2)      విత్తనం వరుసకు 5-6 సెం. మీ దూరం గా ప్రక్క గా 4-5 సెం. మీ లోతుగా ఎరువులు వేయు బాండ్ పధ్ధతి.

విత్తనం కంటే లోతుగానూ, విత్తనానికి దిగువ గా ఎరువును కర్ర నాగలి తో సింగిల్ బాండ్ పధ్ధతి లో వేయ వచ్చును. నాగలి వెనుక అక్కడి  లేదా పొరా ఒకటి తగిలించి, నాగలి చాలు లో చేతి తో విత్తనం వేయాలి. అక్కడి లో ఎరువు వేస్తూ విత్తనం కంటే ఎరువు లోతు గా పడేటట్లు అక్కడి ని లేదా పోరా ను లోతుకు దిగునట్లు కట్టి నడపాలి. తరువాత పట్టి తోలి చాళ్ళను కప్పాలి. ఈ విధం గా చేస్తే ఎరువు బాండ్ మీద       3-5 సెం. మీ ఎత్తుగా మన్ను పడి దాని మీద విత్తనం పడుతుంది. పట్టి తోలినప్పుడు విత్తనాలు మట్టితో కప్పి వేయబడతాయి. ఈ పధ్ధతి వలన విత్తనాలకు ఎరువు అంటుకొనదు. మొలక దెబ్బ తినదు . ఈ పధ్ధతి ని ప్లౌ సోల్ ప్లేస్ మెంట్ ( నాగలి చాలు లో ఎరువు వేత ) అంటారు.
            ఇచ్చిన కాల  పరిమితి లో ఎక్కువ విస్తీర్ణం లో విత్తనం, ఎరువు వేయాలంటే 4 లేదా 6 చెక్కల గొర్రు లను (రాయల గొర్రు) ఉపయోగించ వచ్చు.

ఆకుల మీద స్ప్రే చేయడం:
·         రసాయన ఎరువును నీటిలో కరిగించి, ఆ ద్రావణాన్ని ఆకుల మీద పిచికారీ చేయడం ద్వారా మొక్కలకు పోషకాలందించడం ఒక పధ్ధతి.
·         చాలా పోషక పదార్ధాలు నీటిలో కరిగించి స్ప్రే చేస్తే ఆకులు వాటిని త్వరగా గ్రహిస్తాయి.
·         సాధారణంగా నత్రజని, సూక్ష్మ పోషకాలు ఆకుల మీద పిచికారి చేసి మొక్కలకు అంద జేయవచ్చు.
·         ద్రావణ గాఢత విషయం లో జాగ్రత్త వహించాలి (ఉదా: యూరియా గాఢత ఎక్కువ అయితే ఆకులు మాడి పోతాయి.)
·         వేర్వేరు పంటలు వేర్వేరు ద్రావణ గాఢత లను తట్టుకోలేవు .
·         ఇనుము, జింకు, రాగి, బోరాన్, మాంగనీస్ వంటి సూక్ష్మ పోషకాలను ఆకుల మీద పిచికారి చేయడం ద్వారా సమర్దవంతం గా మొక్కలకు అందజేయవచ్చు.

విమానం ద్వారా వేయుట:
  • ఈ పధ్ధతి మన దేశానికి వీలు కాదు. పాశ్చాత్య దేశాలలో ఒకే పైరు ను వేల ఎకరాలలో వేస్తారు కాబట్టి విమానం నుండి ఎరువులు వేయుట సాధ్యమైన పని. కాని మన దేశం లో నిర్ణీత స్థలం లో అనేక పంటలు ఉంటాయి. కనుక ఈ పధ్ధతి ఏ మాత్రం ఉపయోగకారి కాదు.
సాగు నీటి ద్వారా వేయుట (Fertigation):
  • డ్రిప్ ద్వారా ఎరువులను పైరులకు అందించడం మన దేశం లో చాలా ప్రాంతాల్లో వాడుకలో ఉంది. ముఖ్యం గా కాయ గూర పంటలకు ఈ పధ్ధతి ద్వారా నత్రజని ఎరువును అందించి నట్లయితే మంచి ఫలితాలు సాధించవచ్చు.

No comments:

Post a Comment