Saturday, June 25, 2011

బయోగ్యాస్ ప్లాంటు


బయోగ్యాస్ ప్లాంటు (గోబర్ గ్యాస్ ప్లాంటు)
(పేడ నుండి వంట గ్యాస్ తయారు చేయు యంత్రము)

పశు విసర్జనలు, పశు గ్రాస వ్యర్ధాలు ఎరువుగా చేసి పంట పొలాలకు వేయడం అనాది గా వస్తున్నది. కాని ఆ పశువుల పేడను ఉపయోగించి వంట వాయువును (gobar gas) తయారు చేసుకొని దాని నుండి వచ్చిన పెంట పోగు అన్ని విధాలా లాభదాయక మన్నది జర్మనీ శాస్త్ర వేత్తలు కనుగొన్నారు. దీని వల్ల గ్రామీణ ప్రాంతాలు చాలా అభివృద్ధి చెందడం వల్ల బయోగ్యాస్ ప్లాంటును గృహ లక్ష్మి అని పిలుచుకొంటారు.

పశువుల పేడలో హెచ్చు పాళ్ళలో ఉష్ణము నిచ్చు ఇంధనము ఉన్నది. ఈ ప్లాంట్ లో గాలి లేని పరిస్థితులలో (anaerobic conditions) అంటే ప్రాణ వాయువు ఉండని పరిస్థితులలో పశువుల పేడ , ఇతర సేంద్రియ వ్యర్ధ పదార్ధాలు కొన్ని రోజులు పులియ బెట్ట బడతాయి. అవి పులిసి నప్పుడు మీథేన్ , హైడ్రోజన్, కార్బన్ డై ఆక్సైడ్ అనే వాయువులు ఉత్పత్తి అవుతాయి. ఆ వాయువుల మిశ్రమాన్ని వంటకు, ఇతర పనులకు ఉపయోగించ వచ్చును. అవశేషం గా మిగిలే పదార్ధం పోషక పదార్ధాలు బాగా ఉన్న మంచి ఎరువు.

బయోగ్యాస్ ప్లాంట్ లో ముఖ్యం గా నుయ్యి (well) లాగ కాంక్రీట్ తో కట్టబడిన భాగము ముఖ్యమైనది. దీనినే డైజెస్టర్ (digestar)  లేదా ఫెర్మెంటర్(fermenter) అంటారు. దీని పరిమాణం మనకు కావలసిన బయో గ్యాస్ పరిమాణం పై ఆధార పడి ఉంటుంది. సామాన్యం గా 3.5 నుండి 6.0 మీటర్ల లోతు, 1.2 నుండి 6 మీ కైవారం (diameter) తో నిర్మిస్తారు. ఈ డైజెస్టర్ నిర్మాణం లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. దీని కట్టడం లో ఏ లోపాలు ఉన్నాయో అవి బయోగ్యాస్ ప్లాంట్ పని తీరు పై చెడు ప్రభావం చూపుతుంది. ఈ డైజెస్టర్ ను మధ్యకు విడ దీస్తూ ఒక గోడ కడతారు.ఇది ఒక ప్రక్క నీటితో కలిపిన పశువుల పేడ పడటానికి , రెండో వైపు డైజెస్ట్(digest) అయిన చిక్కని స్లర్రీ (slurry) లేదా బయోగాస్ ఎఫ్లుయన్ట్ (effluent) పడడానికి ఉంటుంది. ఇది సామాన్యం గా పేడ , స్లర్రీ మిశ్రమాలతో మునిగి ఉంటుంది.

డైజెస్టర్ కు ఒక ప్రక్కన పేడ ను, సమ పాళ్ళ నీళ్ళ తో కలుపు కోవడానికి (4:5 నిష్పత్తిలో) వీలయిన తొట్టె (mixing tank), దాని నుండి ఆ పేడ నీళ్ళ మిశ్రమము డైజెస్టర్ అడుగు భాగానికి వెళ్ళుటకు అనువు గా ఒక సిమెంట్ గొట్టము అమర్చబడి ఉంటుంది. అదే విధముగా డైజెస్టర్ రెండో ప్రక్కన డైజెస్టు  అయిన పేడ డైజెస్టర్ పై భాగము నుండి బయటకు రావడానికి వీలుగా మరొక గొట్టము అమర్చబడి ఉంటుంది. ఈ బయటకు వచ్చే చిక్కని పదార్ధమును బయోగాస్ ప్లాంట్ ఎఫ్లూఎంట్  అని లేదా  బయోగాస్ ఎరువు అంటారు. దీనిని కంపోష్టు పిట్ (compost pit) కు వెళ్ళే విధం గా ఏర్పాటు చేసుకొంటారు.

డైజెస్టర్ లో సూక్ష్మ జీవులు తయారు చేసే గ్యాస్ ను సేకరించుటకు వీలుగా పై భాగంలో ఒక గుండ్రని ఇనుప డ్రమ్ము తల క్రిందులు గా బోర్లించి అమర్చ బడి ఉంటుంది. ఈ ఇనుప డ్రమ్ము బయో గ్యాస్ ప్లాంట్ లో తయారయిన మీథేన్ వంటి వాయువుల పరిమాణము, పీడనము బట్టి పైకి క్రిందకు కదులుతూ ఉంటుంది. ఈ కదలికలో ఇనుప డ్రమ్ము ప్రక్కకు వంగ కుండా మరియు డైజెస్టర్ క్రింది భాగానికి తగలకుండా కట్టడం లో జాగ్రత్తలు తీసుకొంటారు.

డ్రమ్ము లో సేకరించబడిన బయో గ్యాస్, దానిపై మధ్య భాగం లో అమర్చబడిన ఒక చిన్న గొట్టము ద్వారా వుపయోగించబడుతుంది. గ్యాస్ వాడక నియంత్రణ కు ఒక కవాటం (valve) మరియు గ్యాస్ పైప్ లో నీరు చేరకుండా ఒక నీటి సేకరిణి (moisture trap)  అమర్చ బడి ఉంటాయి.
ప్రతి సంవత్సరం డ్రమ్ము తుప్పు పట్టకుండా (rusting) తగిన జాగ్రత్తలు తీసుకోవలెను.

బయోగ్యాస్ ప్లాంట్ వలన ఉపయోగాలు:
  1. బయోగ్యాస్ ప్లాంట్ లో వాడే పశువుల పేడ నుండి మీథేన్ వాయువు (methane gas)వంట చేసుకోవడానికి, విద్యుత్ దీపాలు వెలిగించు కోవడానికి మరియు యంత్రాలు నడపడానికి ఉపయోగపడుతుంది.దీనివల్ల వంట చెరకు విద్యుత్ ఆదా అవుతుంది.
  2. మీథేన్ వాయువు విడుదల పూర్తి అయిన తర్వాత మిగిలిన పేడ (biogas slurry) మామూలు పేడ కన్నా ఎక్కువ పోషక విలువలు కలిగి ఉంటుంది.దీనివల్ల పైర్లు మరింత దిగుబడి నిస్తాయి.
  3. బయోగ్యాస్ ప్లాంట్ ఆరోగ్యకరమైన, పరిశుభ్రమైన పరిస్థితులలో పని చేయడం వలన చెడు వాసన రాదు. ఈగలు దోమల పెరుగుదల నివారించ బడుతుంది.
  4. రైతుకు దీని వల్ల వంట చెరకు, విద్యుత్ ఖర్చులు ఆదా అవడమే గాక, పంట దిగుబడులు పెరిగి వారి జీవన శైలి లో  మార్పుకు దోహద పడుతుంది.

బయోగ్యాస్ తయారీ లో తీసుకోవలసిన జాగ్రత్తలు:
  1. గృహ అవసరాలకు కావలసిన 2 ఘనపు మీటర్ల గోబర్ గ్యాస్ తయారీకి కనీసం 50 కిలోల పేడ సిద్ధం గా ఉండాలి.దాని కొరకు కనీసం పశువులు సంఖ్య ఐదు కు తగ్గకుండా ఉండాలి.
  2. వంట గదికి గోబరు గ్యాస్ ప్లాంట్ 20 మీటర్ల దూరానికి ఎక్కువ కాకుండా ఏర్పరచుకోవాలి.
  3. వాడే పశువుల పేడ లో గల చెత్త చెదారాన్ని తీసివేసి పేడ పరిమాణానికి సమాన పరిమాణంలో నీరు తో కలిపి ప్లాంటు లోనికి ప్రవేశ పెట్టాలి.
  4. పశువుల పేడ కు బదులు గా పంది , కోళ్ళ విసర్జనలు, మానవ విసర్జనలు కూడా వాడుకోవచ్చు. అంతే గాక వృక్ష సంబంధ సేంద్రియ పదార్ధాలు కూడా వాడుకోవచ్చు. కాని వాయువు విడుదల లో సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయి.
ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమీషన్ వారు పల్లెలలో గోబర్ గ్యాస్ ప్లాంటు నిర్మాణానికి అవసరమైన సాంకేతిక సహాయం అందజేస్తారు.

No comments:

Post a Comment