Saturday, June 25, 2011

వర్మి కంపోస్టు

                                                                             వర్మి కంపోస్టు
VERMI COMPOST

వాన పాములు సేంద్రియ పదార్ధము ఎక్కువగా గల నెలల్లో బొరియలు చేస్తూ నేలను గుల్లగా చేస్తాయి. వీటికి సేంద్రియ పదార్ధం తో మిళితమైన మట్టి ఆహారం. అంటే రమారమి 70 % మట్టిని, 30 % సేంద్రియ పదార్దాన్ని ఆహారంగా తీసుకొంటాయి.

కొన్ని ప్రత్యేకమైన వానపాములు 90 % సేంద్రియ పదార్ధము, కేవలం 10 % మట్టిని ఆహారం గా తీసుకొంటాయి. సేంద్రియ పదార్ధం తో మిళితమైన మట్టిని ఆహారం గా తీసుకొని విసర్జన చేసిన పదార్ధమే వర్మి కంపోస్టు అంటారు.

వానపాములు తీసుకొన్న ఆహారం జీర్ణ వ్యవస్థలో అనేక రూపాంతరాలు చెంది అనేక రసాయనాలతో మిళితమైన పదార్ధాన్ని విసర్జించడం వాళ్ళ ఆ పదార్ధంలో పోషకాలతో పాటు అనేక రకాల విటమిన్లు, ఎంజైములు వుండడం వల్ల వర్మి కంపోస్టు విలువ చాల ఎక్కువ

వర్మి కంపోస్టు కు అనువైన వానపాములు.
  1. పెరియోనిక్స్ ఎక్సవేటస్     ( Perionyx excavatus)
  2. ఇసీనియా ఫోటిడా                        (Eisenia foetida)
  3. యూడ్రిల్లస్ యూజిని        (Eudrillus eugineae)
  4.  లాంపిటో మారుతి           (Lampito marutii)
తయారుచేసే విధానం:
  • ఒక మీటరు వెడల్పు( 3) , 3 మీటర్లు (9) పొడవు , 1 అడుగు ఎత్తు ఉండేలా మూడు సిమెంటు తొట్లను నిర్మించాలి. వీటిపై తాటి ఆకులు గాని కొబ్బరి ఆకులతో గాని ఒక షెడ్ వేసి నీడ ఉండేటట్లు చెయ్యాలి.
  • తొట్టెల క్రింద భాగం గట్టిగా ఉండాలి. వీటిలో ముందుగా 6 అంగుళాల మందంలో కొబ్బరి పీచు, అరటి ఆకులు గాని, చెరకు చెత్త గాని చిన్న చిన్న ముక్కలుగా చేసి పరచాలి. దీనిని బెడ్ అంటారు
  • పశువులు తినగా మిగిలిన గడ్డి, చెరకు చెత్త, పాడైపోయిన కూరగాయలు, పండ్లు వంటి వ్యర్ధ పదార్ధాలను సేకరించి పశువుల పేడతో కలిపి ఒక చోట వుంచి కుళ్ల నివ్వాలి. ఈ విధం గా కుళ్ళిన పదార్ధం తో తొట్టెలు సగం వరకూ నింపాలి. దీనిపై చదరపు మీటరుకు 1000 చొప్పున వానపాములు వదిలి పెట్టాలి. వీటిపై మరల కుళ్ళిన వ్యర్ధ పదార్ధాలను వేసి తొట్టెను పూర్తిగా నింపాలి. ఈ విధంగా చేసినపుడు 3 తొట్టెలకు 12 వేల వానపాములు సరిపోతాయి. తరువాత తేమ నిల్వ వుండుటకు గాను తొట్టెలపై గోనె పట్టాలు గాని, వరి చెత్త గాని పరచి వేసవి కాలం లో అయితే ప్రతి రోజూ, మిగిలిన కాలాల్లో మూడు రోజులకొకసారి నీటిని చల్లుతూ 30-40 శాతం తేమ ఉండేటట్లు చూచుకోవాలి.
  • వర్మి కంపోస్టు మొదటి సారి రెండు నెలల్లో తయారు అవుతుంది. పూర్తిగా తయారయిన వర్మి కంపోస్టు పొడిగా, నల్లగా, తేలికగా టీ పొడి వలె ఉంటుంది. కంపోస్టు తయారయిందని నిర్దారించుకున్న తరువాత 3-4 రోజులు నీటిని చల్లడం మానాలి. అప్పుడు తేమను వెదుక్కుంటూ వానపాములు బెడ్ వద్దకు చేరుకుంటాయి. అప్పుడు తయారయిన వర్మి కంపోస్టు ను సేకరించి మూడు మి .మీ  జల్లెడ తో వానపాములు వాటి గ్రుడ్లు లేకుండా జల్లించి, సంచులలో వేసి నిల్వ చేసుకోవాలి.
  • ఎరువు సేకరించిన తర్వాత తొట్టె లలో మరలా చివికిన వ్యర్ద పదార్ధాలను వేసి తిరిగి ఎరువును తయారు చేసుకోవచ్చు. ఒక టన్ను వ్యర్ద పదార్ధాలనుండి 600 700 కిలోల వర్మి కంపోస్టు తయారవుతుంది.

వర్మి కంపోస్టు తయారీ లో తీసుకోవలసిన జాగ్రత్తలు.
  • వానపాములను సూర్యరశ్మి నుండి, వర్షము నుండి రక్షణ కల్పించాలి.
  • వర్మి కంపోస్టు బెడ్స్ లో 30-40 శాతం తేమ ఉండేటట్లు చూసుకోవాలి
  • పాక్షికం గా కుళ్ళిన వ్యర్ద పదార్ధాల మిశ్రమాన్ని వాడడం శ్రేయస్కరం
  • ఎలుకలు , చీమలు, కోళ్ళు, మొదలైన శత్రువుల బారి నుండి రక్షణ కల్పించాలి.
  • వ్యర్ధ పదార్ధాలను వేయడం, వర్మి ఎరువును సేకరించడం సకాలం లో జరగాలి.
  • వ్యర్ద పదార్ధాలలో ప్లాస్టిక్ మరియు గాజు పదార్ధాలు లేకుండా చూచుకోవాలి.


వర్మి కంపోస్టు వలన లాభాలు.
  • వర్మి కంపోస్టు లో 1-1.5 శాతం నత్రజని, 0.8 శాతం భాస్వరం, 0.8 శాతం పొటాష్ తో పాటు, కాల్షియం, మెగ్నీషియం, రాగి, ఇనుము, జింకు వంటి సూక్ష్మ పోషకాలు, విటమిన్లు, ఎంజైములు, హార్మోనులు ఉండుట వల్ల మొక్కలు పెరుగుదల బాగా ఉండి, దిగుబడులు పెరుగుతాయి.
  • నేల నీటి నిల్వ సామర్ధ్యం పెంచుతుంది.
  • నేల యొక్క ఆమ్ల లేదా క్షార లక్షణాలను తొలగించవచ్చు.
  • మొక్కలకు చీడ పీడలను తట్టుకొనే శక్తి వస్తుంది.
  • కూరగాయలలో రుచి, పూలలో సువాసన, ఆహార పదార్ధాల నిల్వ సామర్ధ్యం పెరుగుతుంది.
  • పర్యావరణ కాలుష్యాన్ని తగ్గిస్తుంది.

వర్మి కంపోస్టు వాడే విధానం
·         వివిధ పంటలకు ఎకరాకు ఒక టన్ను వేయవచ్చు.
·         పండ్ల మొక్కలకు చెట్టుకు 5-10  కిలోల వరకూ వేయ వచ్చు.
·         పూల కుండీలలో 200 గ్రాముల వరకూ వేసుకోవచ్చు

No comments:

Post a Comment